గుజరాత్‌లోని వడోదర నగరానికి చెందిన ఒక మహిళా ఆటో డ్రైవర్, పగలు కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూనే, రాత్రి వేళల్లో ఆపదలో ఉన్నవారికి ఉచిత సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి 3 గంటల సమయంలో కూడా ఎవరైనా ఫోన్ చేసి సహాయం కోరితే, ఆమె ఏమాత్రం వెనుకాడకుండా తన ఆటోతో అక్కడికి చేరుకుంటారు.
ఆమె భర్త కూడా ఆటో డ్రైవరే. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకూడదని భావించిన ఆయన, తన భార్యకు డ్రైవింగ్ నేర్పించారు. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ దంపతులు, కుటుంబ బాధ్యతలను మోస్తూనే సమాజ సేవలోనూ పాలుపంచుకుంటున్నారు. నగరాల్లో రాత్రి వేళల్లో వాహనాలు దొరకక గర్భిణులు, రోగులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆమె, ఈ నిర్ణయం తీసుకున్నారు.
అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారికి ఆమె ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. చాలా మంది డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేస్తున్నారు. సమాజంలో మహిళలకు భద్రతా భావాన్ని కల్పించడమే తన జీవిత లక్ష్యమని ఆమె చెబుతున్నారు.
ఈ మహిళా డ్రైవర్ సేవా నిరతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్వార్థం పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆపదలో ఉన్నవారికి దేవుడిలా సహాయం చేస్తున్న ఆమెను పలువురు ఆదర్శంగా కొనియాడుతున్నారు.







