సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న RAW NTR అనే సంస్థకు తమతో ఎలాంటి అనుబంధం లేదని ఆయన కార్యాలయం తేల్చి చెప్పింది. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే అధికారం గానీ, ఆయన పేరుతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే హక్కు గానీ లేవని మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఆ సంస్థ తమను తాము ఎన్టీఆర్‌తో ముడిపెట్టుకుని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్న విషయం కార్యాలయం దృష్టికి వచ్చింది. అయితే ఎన్టీఆర్ గానీ, ఆయన బృందం గానీ ఆ సంస్థతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని, దాని కార్యకలాపాల్లో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ చర్యలు లేదా అధికారిక ప్రకటనల వివరాలు కేవలం ఆయన లేదా అధికారిక బృందం ద్వారా మాత్రమే వెలువడతాయని ప్రకటనలో పేర్కొన్నారు. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు ప్రచారం చేసే సమాచారాన్ని విశ్వసనీయమైనదిగా భావించవద్దని, అలాంటి ప్రకటనలను అధికారికంగా పరిగణించకూడదని కోరారు.

ఈ ప్రకటననే తమ తరఫున తుది వివరణగా భావించాలని, దీనితో ఈ విషయమై ఉన్న అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్లు, సోషల్ మీడియా వేదికలు మరియు అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, కార్యాలయం నుంచి వచ్చే సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.