విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి బహుముఖ ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. విశాఖపట్నం విమానాశ్రయం నావికాదళం ఆధీనంలో ఉండటంతో రాత్రి వేళల్లో విమానాల ల్యాండింగ్, అంతర్జాతీయ సర్వీసులపై ఉన్న పరిమితులు భోగాపురం ప్రాజెక్టుతో తొలగిపోనున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న 3.8 కిలోమీటర్ల కోడ్-ఈ రన్‌వే ద్వారా బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A330 వంటి భారీ విమానాలు నేరుగా దిగే అవకాశం ఉంటుంది.

ఈ విమానాశ్రయం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్య వ్యూహాత్మకంగా ఉండటంతో, మూడు జిల్లాల ఆర్థిక కార్యకలాపాలకు ఇది కేంద్రంగా మారుతుంది. ఏటా 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల ద్వారా అరకు కాఫీ, జీడిపప్పు, మామిడి పండ్లు, సముద్ర ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు. దీనికి తోడు 6 లైన్ల జాతీయ రహదారి, బీచ్ కారిడార్ రోడ్డు, మెట్రో రైలు కనెక్టివిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

ఎయిర్‌పోర్ట్ చుట్టూ 2,200 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఏరోసిటీ ద్వారా ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ డ్రోన్ తయారీ రంగాల్లో వృద్ధి నమోదవుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా ఏటా 9 వేల మంది విద్యార్థులకు పైలట్, గ్రౌండ్ స్టాఫ్ శిక్షణ అందుతుంది. మొదటి దశలోనే లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని, తద్వారా స్థానికంగా ఉపాధి పెరిగి వలసలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ నగరం భోగాపురం వైపు విస్తరిస్తుండటంతో ఆనందపురం, తగరపువలస ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగనున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఫైవ్ స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రానున్నాయి. హైదరాబాద్, బెంగళూరు తరహాలో గ్లోబల్ కంపెనీలు తమ ఐటీ డేటా సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వివరించారు.