వర్షాకాలంలో నదులు, జలపాతాల వద్ద ప్రజలు ప్రదర్శించే నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదమని ఉత్తరాఖండ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ముగ్గురు యువకులు సాహసం చేస్తున్న వీడియోను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
వీడియోలో భారీ వర్షాల కారణంగా కొండ నది వేగంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. నది మధ్యలో ఉన్న ఒక పెద్ద బండరాయిపై నిలబడిన ముగ్గురు యువకులు, చుట్టూ నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా నేరుగా నదిలోకి దూకి ఈత కొట్టారు. ఈ దృశ్యాలు చూసేవారికి భయం కలిగిస్తున్నాయి.
కొండ ప్రాంతాల్లోని నదులు పైకి ప్రశాంతంగా కనిపించినా, లోపల బలమైన ప్రవాహాలు, లోతైన గుంతలు, పెద్ద రాళ్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్షణిక ఉత్సాహం కోసం చేసే ఇటువంటి విన్యాసాలు ప్రాణాంతకంగా మారతాయని పోలీసులు స్పష్టం చేశారు.
నదులు, జలాశయాల వద్ద సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా ప్రమాదకరమైన పనులు చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని వారు కోరారు.







