రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లా ఉమర్దా ఖేడా గ్రామంలో ఒక చిరుతపులి సంచరిస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. కేవలం 18 గంటల వ్యవధిలో ఈ చిరుత ఐదుగురు వ్యక్తులపై దాడులు చేసింది. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడిన 45 ఏళ్ల లోగర్ లాల్ మీనా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు.

మంగళవారం సాయంత్రం లోగర్ లాల్ మీనాపై దాడి చేసిన చిరుత, బుధవారం నలుగురు గ్రామస్తులపై కూడా దాడి చేసింది. నలుగురు వ్యక్తులు కలిసి ఇరుకైన దారిలో నడుస్తుండగా పొదల నుంచి అకస్మాత్తుగా చిరుత బయటకు వచ్చింది. ఆ గుంపులో ముందున్న కాలూ అనే వ్యక్తిని చిరుత ఈడ్చుకెళ్లగా, మిగిలిన గ్రామస్తులు రాళ్లతో దాడి చేయడంతో అది అతడిని వదిలి పారిపోయింది.

ఈ దాడుల్లో గాయపడిన లోగ్రి బాయి, 60 ఏళ్ల జగ, 20 ఏళ్ల హితేష్, 40 ఏళ్ల కాలూ ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని మహారాణా భూపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు లోగ్రి బాయిపై దాడి జరిగినప్పుడు ఆమె గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు స్పందించి ఆమెను కాపాడారు.

గ్రామస్తుల భద్రత కోసం అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను పట్టుకోవడానికి పలు చోట్ల బోనులు ఏర్పాటు చేయడంతో పాటు, దాని కదలికలను గమనించేందుకు కెమెరాలను అమర్చారు. భిందర్, కురాబాద్, ఉదయపూర్ ప్రాంతాలకు చెందిన అటవీ సిబ్బందిని ఈ గ్రామంలో మోహరించారు.

ప్రస్తుతం గ్రామస్తులు ఒంటరిగా బయటకు రావద్దని, రక్షణ కోసం కర్రలు పట్టుకుని గుంపులుగానే ప్రయాణించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే పిల్లలతో పాటు కొందరు గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.