బంగారం ధర గ్రాముకు రూ.400 తగ్గినా వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. 2025 జనవరిలో గ్రాము 916 బంగారం ధర రూ.6,600 నుంచి రూ.19,200ల ఆల్‌టైం రికార్డుకు చేరి, ప్రస్తుతం రూ.14,500 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 5,600 డాలర్ల గరిష్టం నుంచి 4,200 డాలర్లకు పడిపోయింది. ఇంతటి ధరల తగ్గుదల ఉన్నా మార్కెట్లో జోష్ కనిపించడం లేదు.
నిత్యావసర సరకుల ధరలు పెరగడం, భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న భయంతో ప్రజలు పొదుపు బాట పట్టారు. వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోవడంతో ఇతర వస్తువుల కొనుగోలు ఆసక్తి తగ్గింది. ఇది కేవలం లోహం మీద మోజు తగ్గడం కాదు, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడానికి నిదర్శనం. పెళ్లిళ్ల సీజన్ ఉన్నా ప్రజలు లైట్ వెయిట్ జ్యువెలరీ లేదా పాత బంగారం మార్పిడి వైపు మొగ్గు చూపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు గత నెల 13న బంగారం దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులను దిగుమతిదారులుగా అనుమతించకపోవడంతో ప్రస్తుతం కేవలం మూడు నామినేటెడ్ ఏజెన్సీలు మాత్రమే దిగుమతి చేస్తున్నాయి. దీంతో నెలవారీ దిగుమతులు 75-100 మెట్రిక్ టన్నుల నుంచి 25-30 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడటం, వడ్డీ రేట్లు తగ్గించకపోవడంతో పెట్టుబడిదారులు బాండ్ల వైపు మళ్లారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (ప్రపంచ బంగారం మండలి) గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు 22 శాతం తగ్గాయి. యుద్ధ ఖర్చుల కోసం రష్యా కేంద్ర బ్యాంకు గత నాలుగు నెలల్లో 30 టన్నుల బంగారాన్ని అమ్మేసింది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే భారత్‌లో కూడా ఆభరణాల డిమాండ్ గణనీయంగా తగ్గింది. యువత భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్‌ల (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) వైపు మొగ్గు చూపుతోంది.
రిటైల్ నగల వ్యాపారులు సుంకాల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చిన్న, మధ్యతరహా సంస్థలను కుదేలు చేస్తుందని, స్మగ్లింగ్‌ను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దిగుమతులు తగ్గించడం ద్వారా మిగిలిన ఫారెక్స్ రిజర్వులను (విదేశీ మారక నిల్వలు) ముడిచమురు, ఎరువుల కొనుగోలుకు వాడుకోవచ్చని భావిస్తోంది. దేశంలో ఇళ్లల్లో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తెచ్చే గోల్డ్ మోనిటైజేషన్ (బంగార నగదీకరణ) పథకాల అమలుకు పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.







