మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని నాసర్‌రెడ్డి నగర్ ఎంపీపీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతుండగా, ఒక భారీ జెర్రిపోతు నిశ్శబ్దంగా తరగతి గదిలోకి వచ్చింది. పామును గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా భయపడి గదిలోంచి బయటకు పరుగులు తీశారు.

విద్యార్థుల అరుపులకు భయపడిన ఆ పాము గదిలోని ఒక బెంచ్ కిందకు వెళ్లి దాక్కుంది. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు, స్థానిక స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్లికార్జున, చాలాసేపు శ్రమించి బెంచ్ కింద ఉన్న ఐదు అడుగుల పొడవున్న పామును సురక్షితంగా పట్టుకున్నారు.

పామును పట్టుకున్న అనంతరం మల్లికార్జున విద్యార్థులకు దానిపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో పాములు పోషించే పాత్రను ఆయన వివరించారు. జనావాసాల్లోకి పాములు వచ్చినప్పుడు వాటిని చంపకుండా, తనకు సమాచారం ఇస్తే పట్టుకుని సురక్షితమైన మైదాన ప్రాంతాల్లో వదిలేస్తానని ఆయన తెలిపారు.