రాజేంద్రనగర్ నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 18న నమోదైన ఈ కేసులో నిందితుడు జూలై 28న మిర్యాలగూడలో పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు అతడిని కస్టడీకి తీసుకున్నారు.

అయితే, కస్టడీలో పోలీసులు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన మేజిస్ట్రేట్, సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో విచారణ ఎలా జరిపారని పోలీసులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు, రెండు రోజుల కస్టడీ గడువు ఆగస్టు 7 సాయంత్రం 5 గంటలతో ముగిసింది. నిందితుడు విచారణలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు దాఖలు చేసిన ఈ కస్టడీ పిటిషన్‌పై శనివారం (ఆగస్టు 8) కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు నిర్ణయంపైనే తదుపరి దర్యాప్తు ఆధారపడి ఉంది.