తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ రోజున సింగపూర్ కళాకారులు తమ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. తిరుమల మాడవీధుల్లో ఈ నాట్య నివేదన జరగనుంది. సింగపూర్‌కు చెందిన అభినయ నాట్యాలయ, మాతృశ్రీ సాయి అకాడమీ విద్యార్థులు, వారి గురువులు, తల్లిదండ్రులతో కలిపి మొత్తం 45 మంది ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి తిరుమలకు వస్తున్నారు.
విదేశాల్లో ఉంటున్న తెలుగు వారికి మన సంస్కృతి, సంగీతం, నృత్య సంప్రదాయాలను పరిచయం చేయడమే శ్రీ సాంస్కృతిక కళాసారథి–సింగపూర్ (SSKS) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు తెలిపారు. ఈ యువ కళాకారులు తమ సొంత ఖర్చులతో భారత్‌కు వచ్చి ఈ సేవలో పాల్గొనడం విశేషం. సింగపూర్, జర్మనీ నుంచి కళాకారులు ఇలా స్వీయ ఖర్చులతో వచ్చి నాట్య నివేదన సమర్పించడం ఇదే మొదటిసారి.
ఈ ప్రదర్శనలో పాల్గొనే కళాకారులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వీఐపీ దర్శనం, లడ్డూ ప్రసాదాలు, స్థానిక రవాణా సదుపాయాలను కల్పిస్తోంది. భక్తులు ఈ నాట్య నివేదనను టీటీడీకి చెందిన ఎస్వీబీసీ (SVBC) ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.
సెప్టెంబర్ 19న సాయంత్రం 6:00 గంటలకు, సెప్టెంబర్ 20న ఉదయం 8:00 గంటలకు ఈ నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి. కళాకారులను ఆశీర్వదించాలని నిర్వాహకులు భక్తులను కోరారు.








