తిరుమల ఏడవ మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం అదృశ్యం కావడంతో పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21న ఉదయం జీపులో తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుండగా, మార్గమధ్యంలో నిందితుడు యశ్వంత్ కుమార్ జీపు ఆపించి విగ్రహాన్ని దొంగిలించినట్లు విచారణలో తేలింది.
నిందితుడు బి.టెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మికత వైపు మళ్లిన అతను, విజయనగరం జిల్లా గొర్లమండలంలోని ఒక మఠంలో కొంతకాలం గడిపాడు. తిరుమల పర్యటనలో ఉన్నప్పుడు ఆ విగ్రహం నచ్చడంతో, దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
పోలీసులు జీపు డ్రైవర్‌ను విచారించి నిందితుడి వివరాలు సేకరించారు. సాంకేతిక ఆధారాలను ఉపయోగించి, విశాఖపట్నం పారిపోతుండగా యశ్వంత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.








