టిబెట్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే వరదలు బీభత్సం సృష్టించగా, ఇప్పుడు మరో కొత్త ముప్పు పొంచి ఉంది. హిమాలయాల్లోని ఎగువ ప్రాంతంలో మట్టి, మంచు, రాళ్లు పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో ఒక బ్యారియర్ లేక్ ఏర్పడింది. ఈ సరస్సులో నీటి మట్టం పెరిగి సహజంగా ఏర్పడిన ఆ అడ్డుగోడ తెగిపోతే, భారీ వరద నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చే ప్రమాదం ఉంది.

గురువారం నాటికి ఈ సరస్సులో 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సరస్సు పొంగిపొర్లుతుండటంతో, ఆ అడ్డుగోడ బలహీనపడితే పరిస్థితి విషమించే అవకాశం ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ పరిస్థితిని పర్యవేక్షించేందుకు చైనా ప్రత్యేక నిఘా పెట్టింది. విపత్తు సహాయక చర్యల కోసం బీజింగ్, చెంగ్డూ నుంచి ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు పనిచేస్తున్నాయి. టిబెట్‌లోని గైరోంగ్ పోర్టులో నిలిచిపోయిన విద్యుత్, కమ్యూనికేషన్ సేవలను ఇప్పటికే పునరుద్ధరించారు.

హిమాలయాల్లో మంచు, హిమానీ సరస్సులు, కొండచరియల వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరత ప్రజలకు, మౌలిక వసతులకు పెను ముప్పుగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. 2025 ఆగస్టులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమానీ సరస్సు పొంగి తొమ్మిది మంది మరణించడంతో పాటు, నేపాల్-చైనాను కలిపే కీలక వంతెన దెబ్బతింది.

నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదల్లో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా జియాలాజికల్ సర్వే (భూగర్భ శాస్త్ర పరిశోధన సంస్థ) వెల్లడించిన వివరాల ప్రకారం, హిమానీ సరస్సు బద్దలవ్వడం వల్లే ఈ విపత్తు సంభవించింది. భారత్ నుంచి 140 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం అందగా, టిబెట్ వైపు ముగ్గురు మరణించి 553 మంది గల్లంతయ్యారు.