తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో శంబో అనే వ్యక్తికి పంటి నొప్పి వస్తుంది. డాక్టర్ సలహా మేరకు తన కొడుకు తిరుపతిని పళ్ళ బురుసు, మందులు తీసుకురమ్మని శంబో అడుగుతాడు. అయితే, కొడుకు వాటిని కొనివ్వకపోవడంతో తండ్రి కేసు వేయడం, ఆ తర్వాత తలెత్తే పరిణామాలే ఈ సినిమా కథ.
తండ్రి పేరిట ఉన్న ఎకరా పొలాన్ని అమ్మి అప్పులు తీర్చుకోవాలని కొడుకు తిరుపతి ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య జరిగే తగాదాలు, వారిద్దరి మధ్య గెలుపోటముల చుట్టూ కథ సాగుతుంది. వయసు పైబడిన తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించే ప్రేమ, ఆధునిక కాలంలో టెక్నాలజీ వల్ల మనుషుల మధ్య పెరుగుతున్న దూరం వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు.
బలగం సినిమా తరహాలోనే తండ్రి పాత్రలో సుధాకర్ రెడ్డి మరోసారి మెప్పించారు. కొడుకు పాత్రలో మురళీధర్ గౌడ్, శంబో స్నేహితుల బ్యాచ్ కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. యువ నటీనటులు ప్రజ్వల్, గోమతి రెడ్డిల కెమిస్ట్రీ కూడా బాగుంది.
అయితే, సినిమా కథనం క్లైమాక్స్ వరకు చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. బలగం వంటి సినిమాల్లో ఇప్పటికే చూసిన తరహా ఎమోషనల్ కాన్సెప్ట్ కావడంతో, ఇందులో కొత్తదనం లోపించిందనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం బాగుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.






