టెస్టు క్రికెట్‌లో 4,000 కంటే ఎక్కువ పరుగులు, 350 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా చేరాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఫీట్ సాధించిన నాలుగో ప్లేయర్‌గా జడేజా నిలిచాడు.

భారత జట్టు తరఫున కపిల్ దేవ్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడు జడేజా. స్పిన్ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్‌లోనూ రాణించే ఆల్‌రౌండర్‌గా ఈ రికార్డు సాధించిన ఏకైక భారతీయ ప్లేయర్ కూడా ఇతడే.

భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ తర్వాత ఐదో స్థానంలో జడేజా ఉన్నాడు. ఇప్పటివరకు అనిల్ కుంబ్లే 619, రవిచంద్రన్ అశ్విన్ 537, కపిల్ దేవ్ 434, హర్భజన్ సింగ్ 417 వికెట్లు తీశారు.

గత దశాబ్ద కాలంగా టెస్టు ఫార్మాట్‌లో బ్యాట్‌తో, బంతితో మ్యాచ్ విన్నర్‌గా జడేజా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఘనతపై క్రీడా వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.