రవితేజ, ప్రియా భవానీశంకర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బాలనటి నక్షత్ర మాట్లాడింది. ఈ చిత్రంలో ఆమె రవితేజ, ప్రియా భవానీశంకర్ కుమార్తె మణికంఠ పాత్రలో కనిపించనుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన రీల్స్ చూసి దర్శకుడు శివ నిర్వాణ ఈ పాత్ర కోసం నక్షత్రను ఎంపిక చేశారు.
కేరళకు చెందిన నక్షత్ర ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించిన అనుభవం ఆమెకు ఉంది. 'ఇరుముడి' సినిమాతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది.
తెలుగు భాష రాకపోయినా సెట్స్‌లో దర్శకుడు శివ నిర్వాణ తనకు ఎంతో సహాయం చేశారని నక్షత్ర చెప్పింది. ఆయన ప్రోత్సాహంతోనే ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పగలిగానని ఆమె పేర్కొంది.
చిన్న వయసులోనే శివరాజ్‌కుమార్, పృథ్వీరాజ్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం సంతోషంగా ఉందని నక్షత్ర తెలిపింది. తన కెరీర్‌కు మద్దతుగా నిలుస్తున్న తన తల్లికి, అలాగే చదువుకు సహకరిస్తున్న టీచర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.








