కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సర్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జునతో కలిసి 'కుబేర' చిత్రంలో నటించారు. ఈ వరుస ప్రాజెక్టులతో తెలుగులో తన మార్కెట్‌ను ధనుష్ మరింత విస్తరించుకున్నారు.

తాజాగా, 'లెనిన్' సినిమా దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరితో ధనుష్ ఒక కొత్త సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మురళీకిశోర్ ధనుష్‌కు కథ వినిపించారని, ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని తెలుస్తోంది. గతంలో ధనుష్‌తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే దర్శకుడు మురళీకిశోర్ పూర్తి కథను ధనుష్‌కు వివరించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చర్చల గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.