తెలంగాణ పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో నేరాల రేటు క్రమంగా పెరుగుతోంది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు 2,65,377 నేరాలు నమోదు కాగా, ఆ తర్వాత ఏడాదిలో ఈ సంఖ్య 2,77,938కి పెరిగింది. 2025 జూలై నుంచి 2026 జూన్ మధ్య కాలంలో మరో 2,84,363 నేరాలు నమోదయ్యాయి. గత మూడేళ్లలో రాష్ట్రంలో మొత్తం నేరాల రేటు 7.15% మేర పెరిగినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
నేరాల పెరుగుదలకు సంబంధించి లక్ష జనాభాకు నమోదయ్యే నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది. ముఖ్యంగా మాదకద్రవ్యాల (డ్రగ్స్) కేసులు 46.10% పెరగడం పోలీసు శాఖకు పెద్ద సవాలుగా మారింది. 2023-24లో 2,026గా ఉన్న డ్రగ్స్ కేసులు, 2025-26 నాటికి 2,960కి చేరాయి. వీటితో పాటు వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కి పెరిగి 1,704% వృద్ధిని నమోదు చేయగా, ట్రాఫిక్ నేరాలు 9.48% పెరిగాయి.
మరోవైపు, సైబర్ నేరాలు 13.29% తగ్గి 22,000కు చేరుకోగా, ఆర్థిక నేరాలు కూడా 13.28% క్షీణించి 32,684గా నమోదయ్యాయి. అయితే, డ్రగ్స్ కేసుల పెరుగుదల సైబరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్‌తో పాటు నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కేసులు 90.98% పెరగడం గమనార్హం.
రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వంటి మాదకద్రవ్యాల ముప్పు పట్టణాలు, గ్రామాలకు విస్తరించడంపై ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








