హైదరాబాద్‌లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ రమేశ్‌బాబు నేతృత్వంలో సమీకృత జల ప్రణాళిక, నిర్వహణ రాష్ట్ర స్థాయి కమిటీ (స్కివమ్) సమావేశమైంది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండటం, ఎల్ నినో ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, ప్రస్తుతం సాగునీటిని విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని, నాట్ల సీజన్ ఇప్పటికే ముగిసిందని చీఫ్ ఇంజినీర్లు (సీఈలు) సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులకు వరదలు వస్తేనే సాగునీటి సరఫరాపై ఆలోచిస్తామని అధికారులు తెలిపారు.
ఏడాది మొత్తానికి అవసరమైన తాగునీటి లెక్కలను సిద్ధం చేయాలని సెక్రటరీ అధికారులను ఆదేశించారు. తదుపరి వరదల ఆధారంగా సాగునీటి అవసరాలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై 15 రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.








