కృత్రిమ మేధ ఆధారిత వాతావరణ అంచనాలను ఉపయోగించి పెట్టుబడి నిర్ణయాలు మార్చుకున్నారు

వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ అంచనాలను ఉపయోగించడం ద్వారా తెలంగాణలోని చిన్న రైతులు తమ వ్యవసాయ నిర్ణయాలను మార్చుకుని ఒక్కొక్కరూ 560 డాలర్ల వరకు ఆదా చేసినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రత్యేకమైన వాతావరణ ముప్పులను ముం దుగానే గుర్తించి, అందుకు అనుగుణంగా రైతులు తమ వ్యవహారశైలిని మార్చుకోవ డం వల్ల ఈ ప్రయోజనం లభించిందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో కూడిన చిన్నస్థాయి ఏఐ సాధనాల వినియోగాన్ని వేగంగా పెంచాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

మంగళవారం విడుదల చేసిన ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2026: ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ నివేదికలో.. ఆర్థిక రంగంలో ఏఐ వినియోగం వల్ల కోట్లాది చిన్న వ్యాపారాలు, రైతులు మరింత ఉత్పాదకంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 2025లో నిర్వహించిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ.. “ఏఐ ఆధారిత వాతావరణ అంచనా వ్యవస్థ ద్వారా చిన్న రైతులు నిర్దిష్టమైన వాతావరణ ముప్పులకు అనుగుణంగా తమ వ్యవసాయ విధానాలను మార్చుకున్నారు. కొందరు రైతులు వ్యవసాయంపై చేసే ఖర్చును మూడో వంతు వరకు పెంచగా, మరికొందరు ఒక్కో రైతుకు 560 డాలర్ల వరకు నికరంగా ఆదా చేసుకున్నారు” అని నివేదిక తెలిపింది.

ప్రభుత్వం, వ్యవసాయ విస్తరణ అధికారులు అందించే సమాచారంపై పెద్దగా ఆధారపడని రైతులు.. ఏఐ ద్వారా అందిన వాతావరణ అంచనాలను ఉపయోగించుకుని మెరుగైన ఉత్పత్తి, పెట్టుబడి నిర్ణయాలు తీసుకున్నారని నివేదిక పేర్కొంది. వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందడంతో ఏ పంటలో ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాల్లో రైతులకు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభించిందని వివరించింది. ప్రభుత్వ పరిపాలనలోనూ ఏఐ ఆధారిత అంచనా విశ్లేషణలు, నిర్ణయ సహాయక వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా గణనీయమైన ప్రయోజనాలు పొందవచ్చని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏఐ ప్రభావాలపై సమగ్రంగా అంచనా వేసిన తొలి నివేదిక ఇదేనని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

ఈ దేశాల్లోని వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు ఇప్పటికే సమస్యలను పరిష్కరించేందుకు, సమాచారాన్ని విశ్లేషించేందుకు, అంచనాలను మెరుగుపరచేందుకు, ప్రజలకు పెద్ద స్థాయిలో సేవలు అందించేందుకు ఏఐని ఉపయోగించడం ప్రారంభించాయని తెలిపింది. పన్నుల వసూళ్లను మెరుగుపరచడం, సామాజిక సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించడం, వైద్య సేవలు, విద్యా రంగాలను మెరుగుపరచడం వంటి అనేక అంశాల్లో ప్రభుత్వాలు ఏఐని ఉపయోగించుకోవచ్చని నివేదిక సూచించింది.

“ప్రస్తుత అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మొదటి పారిశ్రామిక విప్లవాన్ని అందిపుచ్చుకోలేకపోయాయి. దాని మూల్యాన్ని తరువాత రెండు శతాబ్దాల పాటు చెల్లించాయి. ఇప్పుడు ఈ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వాటికి లేదు” అని ప్రపంచ బ్యాంకు గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎకనమిస్ట్ ఇంద్‌మ్రిత్ గిల్ అన్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో మానవాళికి ముప్పు ఏర్పడుతుందా లేదా అనే అంశంపై అభివృద్ధి చెందిన దేశాలు ఆందోళన చెందడాన్ని వాటికే వదిలేయాలని అభివృద్ధి చెందుతున్న దేశాలకు నివేదిక సూచించింది. కొన్ని సంస్థల వద్దే కేంద్రీకృతమయ్యే భారీ పెట్టుబడులతో పెద్ద భాషా నమూనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం కంటే.. తక్కువ ఖర్చుతో కూడిన చిన్న ఏఐ అప్లికేషన్లను ఆర్థిక వ్యవస్థలోని విసృ్తత రంగాలకు అందుబాటులోకి తీసుకురావడంపై అభివృద్ధి చెందుతున్న దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ బ్యాంకు సిఫారసు చేసింది.