మిషన్ మౌసమ్ పథకం కింద పంచాయతీ మౌసమ్ సేవా పోర్టల్ ద్వారా వాతావరణ హెచ్చరికలను నేరుగా రైతులకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీ అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఉన్న డోప్లర్ వెదర్ రాడార్ (DWR) ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 369 వర్షపాత మాపకాలు, 52 ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు, 31 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా వాతావరణ డేటాను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని వరి, పసుపు, మొక్కజొన్న రైతుల కోసం ప్రత్యేక వాతావరణ సూచనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ సూచనలను ప్రతి వారం మంగళ, శుక్రవారాల్లో రైతులకు క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు.