మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని శ్రీనివాస నగర్‌లో కృష్ణ, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు సాయి ప్రదీప్, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్) కోర్సు చేస్తూ, తన సోదరుడితో కలిసి టెక్సాస్‌లోని శాన్ అంటోనియాలో ఉంటున్నాడు.
అక్కడ సాయి ప్రదీప్‌కు సిద్దిపేటకు చెందిన ఒక యువతి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను గాఢంగా ప్రేమించాడు. అయితే, ఆమె సాయి ప్రదీప్ ప్రేమను నిరాకరించింది. దీంతో అతను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు.
ప్రేమను అంగీకరించమని కోరుతూ సాయి ప్రదీప్ ఆ యువతికి పలుమార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె స్పందించలేదు. యువతి తన జీవితంలో లేకపోతే బతకడం వృథా అని భావించిన సాయి ప్రదీప్, తాను ఉంటున్న గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వారం రోజుల తర్వాత సాయి ప్రదీప్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోనుంది.







