అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎపిక్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, గోమతి, ప్రజ్వల్‌ యాద్మ కీలక పాత్రల్లో నటించగా, పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు.

తెలంగాణ పల్లెలో ఒంటరిగా ఉండే శంభు (సుధాకర్‌ రెడ్డి) తన కొడుకు తిరుపతి (మురళీధర్‌ గౌడ్‌)ను ఒక టూత్ బ్రష్ కొనివ్వమని అడుగుతాడు. అయితే తన సమస్యల్లో ఉన్న కొడుకు తండ్రి మాటను పట్టించుకోకపోవడంతో, మనవరాలి పెళ్లికి పిలవని అవమానంతో శంభు పోలీసులకు, ఆపై కోర్టుకు వెళ్తాడు. ఈ చిన్న వస్తువు చుట్టూ తిరిగే కథలో వృద్ధాప్యంలోని ఒంటరితనం, కుటుంబ బంధాల విలువలను దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు.

సినిమాలోని క్లైమాక్స్, సుధాకర్‌ రెడ్డి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే కథలోని ప్రధాన సంఘర్షణ బలంగా లేకపోవడం, ఫస్ట్‌ హాఫ్‌ నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకు మైనస్‌గా మారాయని సినీ ప్రియుల అభిప్రాయం.

మొత్తానికి కొత్త పాయింట్‌తో వచ్చిన ఈ చిత్రం, బలమైన కథనం లోపించడంతో పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ క్లైమాక్స్‌లోని భావోద్వేగం, సుధాకర్ రెడ్డి నటన ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని చెబుతున్నారు.