తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలోని చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ వేడుకలో నటి త్రిష కృష్ణన్ వీఐపీ గ్యాలరీలోని ముందు వరుసలో, విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుని కనిపించారు. సీఎం విజయ్ జెండాను ఎగురవేసినప్పుడు త్రిష సెల్యూట్ చేశారు. అనంతరం, అధికారిక కార్యక్రమాలను విజయ్ పరిశీలిస్తున్న సమయంలో ఆమె మొబైల్‌లో ఫొటోలు తీస్తూ కనిపించారు.

పరేడ్ ముగించుకుని వెళ్తున్న సమయంలో సీఎం విజయ్ త్రిషకు సెల్యూట్ చేయగా, ఆమె కూడా నవ్వుతూ తిరిగి సెల్యూట్ చేశారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీకి చెందిన మురసోలి పత్రిక తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎటువంటి అధికారిక హోదా లేని నటిని ముందు వరుసలో కూర్చోబెట్టడం సిగ్గుచేటని ఆ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం సముచితం కాదని ఆ పార్టీ మండిపడింది.

మే నెలలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. విజయ్, త్రిష చాలా ఏళ్లుగా ఆప్తమిత్రులుగా ఉంటున్నారు.

మురసోలి పత్రిక విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి హోదాకు ఉండాల్సిన గౌరవం ఈ ఘటనతో దెబ్బతిందని, విజయ్‌కు ఓటు వేసిన వారు కూడా దీన్ని జీర్ణించుకోలేరని ఆ పత్రిక ఘాటు వ్యాఖ్యలు చేసింది.