తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా సాగాయి. అధికార టీవీకే ప్రభుత్వం, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరాయి. ఒకానొక దశలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మధ్య జరిగిన మాటల యుద్ధంతో స్పీకర్ జోక్యం చేసుకుని, ఆ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చింది.

ఎమ్మెల్యేలకు కార్లు బహుమతిగా ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీవీకే ఎమ్మెల్యే సింధు ముఖ్యమంత్రి విజయ్‌ను పొగుడుతూ పాట పాడడాన్ని ప్రస్తావిస్తూ, ఇది అసెంబ్లీనా లేక 'సూపర్ సింగర్' కార్యక్రమమా అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ఈ ఖర్చు అనవసరమని పేర్కొంటూ, తమ 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు ఆ కార్లు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాలను లైవ్ ప్రసారం చేయకపోవడంపై కూడా ఉదయనిధి అభ్యంతరం తెలిపారు. గత డీఎంకే ప్రభుత్వ అవినీతి ఫైళ్లు తన వద్ద ఉన్నాయని సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, సినిమా డైలాగులు వద్దు, ఆధారాలు ఉంటే బయటపెట్టి చర్యలు తీసుకోండని ఆయన సవాల్ విసిరారు. రికార్డుల నుంచి తొలగించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ాయని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.

సభలో మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్, ఉదయనిధిని ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగానే తప్పుగా సంబోధించి, ఆపై సరిదిద్దుకున్నారు. దీనికి ప్రతిగా ఉదయనిధి, నిర్మల్ కుమార్ గతంలో బీజేపీలో పనిచేశారని గుర్తు చేస్తూ వ్యంగ్యంగా 'సంఘీ మంత్రి' అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నిర్మల్ కుమార్, ఉదయనిధిని ఉద్దేశించి బాత్రూమ్ గురించి చేసిన వ్యాఖ్యలు డీఎంకే సభ్యుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

గతంలో కావేరీ నీటి వివాదం సమయంలో నటి త్రిషపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన అరెస్టుకు పోలీసులు వెళ్లినప్పుడు ఆయన భార్య కిరుతిగా చెప్పిన మాటలను ఉద్దేశించే నిర్మల్ కుమార్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సెటైర్ల సంగ్రామం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో సభలో గందరగోళం కొనసాగింది.