అస్సాంలో జన్మించి పుణెలో చదువుకున్న కాయాదు లోహర్, 2021లో కన్నడ చిత్రం 'ముగిల్‌పేట'తో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మలయాళం, తెలుగు పరిశ్రమల్లో అవకాశాలు అందుకున్న ఆమె, శ్రీ విష్ణు హీరోగా నటించిన 'అల్లూరి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
భారీ అంచనాలతో విడుదలైన 'అల్లూరి' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఫంకీ'లో ఆమె నటించారు. ఇందులో తండ్రి బాధ్యతలు తీసుకుని సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టే యువతిగా కాయాదు కనిపించినప్పటికీ, ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
వరుస పరాజయాల తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో సుబ్బు అనే యువతి పాత్రలో ఆమె నటించారు. సినిమాల్లో హీరోయిన్ కావాలనే కలతో మద్రాస్ వెళ్లడం, తండ్రి అప్పుల వల్ల కుటుంబం ఇబ్బందుల్లో పడటం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె పాత్ర సాగుతుంది.
అయితే, ఈ సినిమాలో ఆమె పాత్రను చూపించిన విధానంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లామర్ సన్నివేశాలు, తల్లితో కలిసి నటించిన సీన్లు, పాత్రలోని భావోద్వేగం కంటే వివాదాస్పద అంశాలే ఎక్కువగా చర్చకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
సాధారణంగా సినిమా విజయం సాధించకపోయినా, నటీనటుల పాత్రలకు మంచి పేరు వస్తే తదుపరి అవకాశాలు దక్కుతాయి. కానీ 'ది ప్యారడైజ్'లో కాయాదు పాత్రపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వరుసగా మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, కాయాదు తదుపరి అడుగులపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అందం, ప్రతిభ ఉన్న ఈ నటి భవిష్యత్తులో ఎలాంటి కథలను, పాత్రలను ఎంచుకుంటారనేది ఆమె కెరీర్‌లో కీలకంగా మారింది.








