మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం సకాలంలో రైతులకు అందకపోతే నిధులు మంజూరు చేసినా లక్ష్యం నెరవేరదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయి భూ మి కోల్పోయిన రైతు, నిర్వాసిత కుటుంబం ఖాతాలోకి చేరాల్సిందేనని, కలెక్టర్ల పిడి ఖాతా ల్లో నిధులు ఉండిపోవడం వల్ల ప్రయోజనం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా మారిన భూసేకరణ, పునరావాసం-- పునర్నిర్మా ణం (ఆర్‌అండ్‌ఆర్), అటవీ అనుమతులు తదితర సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన పత్రాలు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ఉన్న చోట ఒకటి రెండు రోజుల్లోనే పరిహారం రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో జ మ కావాలని ఆయన ఆదేశించా రు.

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ భూములకు సంబంధించిన చెల్లింపులు తదితర సమస్యలు అడ్డంకిగా ఉండకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి రూ.5 వేల కోట్లను కేటాయించారని ఆయన తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చినప్పుడు ఆ నిధులు క్షేత్రస్థాయిలో బాధితులకు చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు. నిధులను కలెక్టర్లు పిడి ఖాతాల్లో జమ చేయడంతో ప్రభు త్వ బాధ్యత పూర్తయినట్లు కాదని మంత్రి ఉత్త మ్ తెలిపారు. ఆ డబ్బు భూమిని ఇచ్చిన రైతు కు, నిర్వాసిత కుటుంబానికి చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. మంజూరు నుంచి లబ్ధిదారుడి ఖాతాలో జమ అయ్యే వరకు మధ్యలో ఉన్న ప్రతి అనవసర పరిపాలనా అడ్డంకిని తొలగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ తదితర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,782 కోట్లు విడుదల చేయగా, సుమారు రూ.566 కోట్లు లబ్ధిదారులకు చేరాయని అధికారులు మంత్రి ఉత్తమ్‌తో తెలిపారు. మరో రూ.989 కోట్లు వివిధ దశల్లో చెల్లింపుల ప్రక్రియలో ఉండగా, రూ.199 కోట్లు జిల్లాల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఈ లెక్కల ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని రైతులు, నిర్వాసితుల ఖాతాల్లోకి చేర్చడాన్ని అత్యవసర కార్యక్రమంగా చేపట్టాలని కలెక్టర్లు, నీటిపారుదల అధికారులను ఆదేశించారు. అదనంగా సుమారు రూ.455 కోట్లకు సంబంధించిన టోకెన్లు క్లియర్ అయి తదుపరి ప్రక్రియలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

నిధులు విడుదల కావడం ఒక దశ మాత్రమేనని, అవి వాస్తవంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడమే అసలు ఫలితమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. విడుదలైన నిధులకు, రైతులకు జరిగిన వాస్తవ చెల్లింపులకు మధ్య ఉన్న అంతరాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని కలెక్టర్లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. కలెక్టర్ల పిడి ఖాతాల్లోకి డబ్బులు వచ్చిన తరువాతే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాలనే పద్ధతికి స్వస్తి పలకాలని మంత్రి స్పష్టం చేశారు.

భూసేకరణ ప్రక్రియ, కన్సెంట్ అవార్డులు, అవార్డు నంబర్లు, టోకెన్ల జనరేషన్ వంటి ప్రక్రియలను ముందుగానే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవార్డు నంబర్లు, టోకెన్ వివరాలు సిద్ధమైన వెంటనే అవసరమైన నిధుల విడుదల కోసం నీటిపారుదల శాఖ ఆర్థిక శాఖతో సమన్వయం చేస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో భూసేకరణ కోసం ఇప్పటికే జమ చేసిన నిధులను ఒకటి రెండు రోజుల్లోనే పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు వారం రోజుల సమయం కావాలన్న అధికారుల అభ్యర్థనను ఆయన అంగీకరించలేదు. నిధులు అందుబాటులో ఉండి, లబ్ధిదారుల వివరాలు సిద్ధంగా ఉన్నప్పుడు పరిహారం చెల్లింపును వారం రోజులపాటు నిలిపివేయడానికి కారణం ఉండదని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్లు రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు

సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ఫీడర్ కెనాల్‌తో పాటు ఇతర పనులకు అవసరమైన సుమారు 180 ఎకరాల భూసేకరణకు సంబంధించిన కన్సెంట్ అవార్డులను మొత్తం ఆర్థిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు-- పాలేరు లింక్ కెనాల్ భూసేకరణ అంశాన్ని కూడా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులతో జరిగిన చర్చలకు అనుగుణంగా కన్సెంట్ అవార్డులు, సవరించిన పరిహార అంచనాలను వేగంగా పూర్తి చేయాలని, భూసేకరణ సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. అటవీ అనుమతులకు సంబంధించిన అడ్డంకులపైనా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శాఖల మధ్య సమన్వయ లోపం లేదా అవసరమైన సమాచారం అందించడంలో జాప్యం కారణంగా నీటిపారుదల పనులు నిలిచిపోవడానికి వీల్లేదన్నారు.

జిల్లా కలెక్టర్లు రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులతో సంయుక్త సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు ఇతర నీటిపారుదల పథకాలకు సంబంధించిన అటవీ సమస్యలను సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదన్నారు. ప్రభుత్వం వద్ద నిధులున్నప్పుడు పరిపాలనా జాప్యం కారణంగా బాధితుడు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇంజనీర్- ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, ఈఎన్‌సీ (అడ్మినిస్ట్రేషన్) టి. శ్రీనివాస్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం అండ్ క్వాలిటీ కంట్రోల్) ఆర్. మధుసూదన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.