తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు.
ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి కావని, పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన సమయమని జగన్ చెప్పారు. ఏకగ్రీవాలకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే, ఆ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ కో ఆర్డినేటర్లు, అభ్యర్థులు ఉండరని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాల అమలుపై కూడా జగన్ ప్రస్తావించారు. తాము ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో సమానంగా భావించామని, 99 శాతం హామీలను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా, సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన నెలలోనే పథకాలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.
ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమాన్ని ప్రజల ఇంటి గడపకే చేర్చామని జగన్ వివరించారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా, నాయకుడు తమతోనే ఉన్నాడనే భరోసాను ప్రతి కార్యకర్తకు కల్పించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.








