సోషల్ మీడియాలో వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని భావించి, పలువురు హీరోయిన్లు సోషల్ మీడియాకు దూరమవుతున్నారు. మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్, ట్రోలింగ్ మరియు వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న దాడులతో విసిగిపోయిన నటీమణులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

నటి ఐశ్వర్య లక్ష్మి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. తనకు 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియా వైపు రానని ఆమె తెగేసి చెప్పారు. కెరీర్‌కు సోషల్ మీడియా అవసరమని తెలిసినా, ప్రశాంతత కోసం దానికి దూరంగా ఉండటమే మేలని ఆమె భావిస్తున్నారు.

'ప్రేమలు' సినిమాతో గుర్తింపు పొందిన మమితా బైజు కూడా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చారు. తన కెరీర్‌కు ఇది ముఖ్యమని తెలిసినా, మనశ్శాంతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన అప్‌డేట్స్‌ను తన టీమ్ చూసుకుంటోందని మమిత వెల్లడించారు.

ఇలా సోషల్ మీడియాకు విరామం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. కయాదు లోహర్ సైతం తనకు ప్రైవేట్ స్పేస్ కావాలని, నెగిటివిటీని దూరం చేసుకోవాలని సోషల్ మీడియాకు దూరమయ్యారు. ప్యారడైజ్ సహా మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న కయాదు, మనశ్శాంతి కోసం ఈ చిన్న బ్రేక్ అవసరమని పేర్కొన్నారు.