హర్యానా రాష్ట్రం సోనిపట్‌లోని సిక్కా కాలనీలో సెప్టెంబర్ 14న ఈ ఘటన జరిగింది. చిన్నారి తన అత్త ఒడిలో ఉండగా, పక్కనే ఉన్న ఇంటి గేటు తెరుచుకోవడంతో బయటకు వచ్చిన పిట్‌బుల్ కుక్క వారిపైకి దూసుకొచ్చింది. మొదట మహిళపై దాడి చేసిన కుక్క, ఆ తర్వాత చిన్నారిని పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.
కుక్క దాడి నుంచి చిన్నారిని రక్షించేందుకు అత్త ప్రయత్నించగా, ఆమె కూడా గాయపడింది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను చిన్నారి నుంచి వేరు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఈ దాడిలో చిన్నారి ముఖం, పొత్తికడుపు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి పొత్తికడుపుకు శస్త్రచికిత్స చేసి సుమారు 20 కుట్లు వేశారు. చికిత్స ఖర్చు పెరగడంతో కుటుంబ సభ్యులు బాబును రోహ్‌తక్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (PGIMS)కి తరలించారు.
ప్రస్తుతం చిన్నారికి అక్కడ చికిత్స కొనసాగుతోంది. తాజా వైద్య సమాచారం ప్రకారం, బాబు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కల నియంత్రణ, చిన్నారుల భద్రతపై ఈ ఘటనతో మరోసారి చర్చ మొదలైంది.
అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని సోనిపట్ పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.






