Smart Meters | (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్‌మీటర్‌’ ఓ విఫల ప్రాజెక్టు అని.. ప్రజలను నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. అయినప్పటికీ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మారట్లేదు. స్మార్ట్‌ మీటర్లపై ముందుకే వెళ్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో విమర్శలు ఎదుర్కొన్న ‘స్మార్ట్‌మీటర్‌’ ప్రాజెక్టుపై బీజేపీపాలిత యూపీ ప్రజలు సైతం భగ్గుమంటున్నారు. మీటర్లు పెట్టినప్పటి నుంచి విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని పూర్వాంచల్‌లోని పలు జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే మీటర్లను తొలగించకపోతే నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు యూపీ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (యూపీపీసీఎల్‌), డిస్కమ్‌లు, యూపీ సర్కార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ మీటర్లు బిగించినప్పటి నుంచి కరెంటు చార్జీలు 20 శాతం నుంచి 30 శాతం మేర ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను తొలగించి పోస్ట్‌పెయిడ్‌ మీటర్లను బిగించాలని గత మేలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, ఆ పనులు ఎంతమాత్రం జరుగట్లేదని మండిపడుతున్నారు.

ప్రజల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు అందడంతో ది ఉత్తరప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (యూపీఈఆర్సీ) రంగంలోకి దిగింది. పలు ఇండ్లల్లో యూపీపీసీఎల్‌ బిగించిన స్మార్ట్‌ మీటర్లను విశ్లేషించింది. మీటర్ల రీడింగ్‌లో లోపాలు ఉన్నట్టు కమిషన్‌ గుర్తించింది. అంతేకాదు, స్మార్ట్‌ మీటర్లను బిగించడం కోసం అధికారులు ప్రజల నుంచి అదనంగా వసూళ్లకు పాల్పడినట్టు విచారణలో తేల్చింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు యూపీఈఆర్సీ నోటీసులు ఇచ్చింది. కాగా, యూపీవ్యాప్తంగా అమర్చిన 12 లక్షల స్మార్ట్‌మీటర్లు లోపాలపుట్టగా ఉన్నాయని, బిల్లులు ఎక్కువగా చూయిస్తున్నాయని 2023లో కేంద్ర విద్యుత్తుశాఖ చేపట్టిన పరిశీలనలోనూ తేలింది.

స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. తమ జేబులకు చిలుపెడుతున్న స్మార్ట్‌మీటర్‌ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలంటూ కశ్మీర్‌లోని బుద్‌గామ్‌ ప్రజలు ఇటీవల నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ స్మార్ట్‌మీటర్లు తమకు వద్దంటూ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లాలో ఉన్న రాథోడా గ్రామ రైతులు.. పశ్చిమ్‌ విద్యుత్‌ విట్రన్‌ నిగం లిమిటెడ్‌ (పీవీవీఎన్‌ఎల్‌) కార్యాలయం ముందు ఇటీవల మీటర్లను కుప్పలుగా పోశారు. స్మార్ట్‌మీటర్లు బిగించినప్పటి నుంచి వారానికి రూ. 8 వేల దాకా బిల్లులు వస్తున్నాయని యూపీలోని ఉమర్‌పూర్‌ రైతులు ఆందోళనలు తీవ్రం చేశారు. బుధానా కరెంటు ఆఫీసులో మీటర్లను కుప్పలుగా పోసి నిరసనలు హోరెత్తించారు. వేలల్లో బిల్లులు వస్తున్న మీటర్లను ఊడబీకిన మీరట్‌ రైతులు.. విద్యుత్తు ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. ఏపీలోని శ్రీకాకుళంలో కూడా రైతుల గుండెలమీద స్మార్ట్‌చిచ్చు కుంపటిగా మారింది. స్మార్ట్‌మీటర్లు పెట్టినప్పటి నుంచి తమకు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని బీహార్‌లోని నందలాల్‌పూర్‌, మిల్లీచక్‌, బహదూర్‌పూర్‌, ఐనాయత్‌పూర్‌, రోస్‌రా, సమస్తీపూర్‌ తదితర గ్రామాల ప్రజలు నిరసనలు తెలిపారు.