సినిమా విడుదల తేదీలను ప్రకటించినప్పటికీ, ఆ సమయానికి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడంపై నాగార్జున విమర్శలు చేశారు. హాలీవుడ్‌లో వేల కోట్ల బడ్జెట్ సినిమాలు ఏడాది ముందే సిద్ధమవుతుంటే, మన దగ్గర మాత్రం చివరి నిమిషం వరకు హడావిడి ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

గతంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ నటులు కూడా ఇదే అంశంపై మాట్లాడారు. సినిమా విడుదల తేదీకి ముందు రోజు రాత్రి వరకు మార్పులు చేయడం వల్ల నాణ్యత దెబ్బతింటుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. కనీసం రెండు వారాల ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

తన సొంత అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ, 'లెనిన్' సినిమా విడుదల తేదీని జూన్ 26గా నిర్ణయించినా, నాణ్యత కోసం మరో రెండు వారాలు వాయిదా వేయాల్సి వచ్చిందని నాగార్జున ఒప్పుకున్నారు. టెక్నీషియన్లు ముందే అవుట్‌పుట్ ఇచ్చేలా చూడాలని తాను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.

'అన్నమయ్య', 'నిన్నే పెళ్లాడతా' వంటి సినిమాల సమయంలో నెల ముందే ఫస్ట్ కాపీ చూసుకునేవారమని నాగార్జున గుర్తు చేశారు. ఇప్పుడున్న వర్కింగ్ స్టైల్‌లో ఇది సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కింగ్ చెప్పిన ఈ సూచనలను దర్శక నిర్మాతలు ఎంతవరకు పాటిస్తారో వేచి చూడాలి.