చౌటుప్పల్‌లో శుక్రవారం జరిగిన సీతారామచంద్ర స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర పాలకుల, మీడియా చెప్పుచేతల్లో ఉండకూడదని ఆయన కోరారు.
తెలంగాణ ఉద్యమం ప్రజల ఆత్మగౌరవం కోసమే జరిగిందని, ఆ గౌరవం నిలిచేలా పాలన ఉండాలని ఆయన సూచించారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, బయటి నుంచి వచ్చిన వారి ఆధిపత్యం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేయాలే తప్ప, సీమాంధ్ర కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కాదని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాలను బహిరంగంగా చెబుతున్నానని ఆయన వివరించారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, తాను మాత్రం కాంగ్రెస్ సైనికుడిగానే కొనసాగుతానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.







