హైదరాబాద్‌లోని శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పోలీస్ బాస్ అయిన డీజీపీ హాజరుకాలేదు. దీంతో నిబంధనల ప్రకారం డీజీపీ తర్వాత అత్యున్నత హోదాలో ఉన్న లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ ముందు వరుసలో, ముఖ్యమంత్రికి దగ్గరగా కూర్చోవాల్సి ఉంది.
అయితే, 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్ దళిత అధికారి మహేశ్ భగవత్‌ను అధికారులు వెనుక వరుసకు పరిమితం చేశారు. ఆయన కంటే జూనియర్లైన రెడ్డి సామాజికవర్గ అధికారులు, ప్రమోటీ ఐపీఎస్ అధికారులు మాత్రం ముందు వరుసలో కూర్చున్నారు. ఈ ఘటనపై రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది.
వినాయక చవితి పండుగ సమీక్ష కావడంతోనే దళిత అధికారిని కావాలనే దూరంగా ఉంచారని అధికార వర్గాల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత హోదాలో ఉన్న అధికారిపైనే వివక్ష చూపడం సరికాదని విమర్శకులు మండిపడుతున్నారు.
ఇటీవల అసెంబ్లీలో దళిత అంశాలపై జరిగిన చర్చలు, ఎమ్మెల్సీల సస్పెన్షన్ల తర్వాత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అధికారిక సమీక్షల్లో దళిత ఉన్నతాధికారులకు వెనుక బెంచీలు కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని దళిత సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
శాంతిభద్రతల బాధ్యతలు చూసే దళిత ఐపీఎస్‌ను కులం ప్రాతిపదికన అవమానించడం ప్రభుత్వ నైజాన్ని ప్రతిబింబిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.








