ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నెల 23న అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం పర్యటన షెడ్యూల్ కూడా సిద్ధమైంది. అయితే, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో ఈ ప్రయాణం రద్దయింది.

ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు పాటించాల్సిన ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. లండన్ మరియు అమెరికా పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే, కేంద్రం కేవలం లండన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా లండన్ వెళ్లారు. అక్కడ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఆయన సందర్శిస్తున్నారు. అలాగే ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ కార్యక్రమాల్లో పాల్గొని, కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు.

లండన్‌లో పలు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత, ఆగస్టు 23న ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో, ఆ తేదీన లండన్ పర్యటనను ముగించుకుని నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.