న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కార్యక్రమాలు సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా లేవని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్లే యూఎస్ టూర్ కు పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
సీఎం టూర్ అనుమతి నిరాకరణపై మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన బ్రిటన్ పర్యటన సరైనదిగానే ఉన్నందున ఆ టూర్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే.. అమెరికా పర్యటన షెడ్యూల్ ఉద్దేశం సరిగాలేదన్నారు. " సీఎంలు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చే ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ వాటిని పరిశీలిస్తుంది. వారు సమర్పించే టూర్ ప్రోగ్రాంలు వారి పదవికి, అలాగే ఆ పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలి. అయితే రేవంత్ రెడ్డి అమెరికా విజిట్ కు సంబంధించిన షెడ్యూల్ భిన్నంగా ఉంది. అందుకే పొలిటికల్ క్లియరెన్స్ కు నో చెప్పాం" అని జైస్వాల్ పేర్కొన్నారు.








