దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన ఇసుక వ్యాపారి దండుగుల రాజు, తన భార్య భాగ్య, కుమారుడు నిహాన్ష్, కూతురు శాన్వికతో కలిసి బుధవారం సిద్దిపేట వెళ్లారు. బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ (చనిపోయిన పది రోజులకు చేసే కార్యక్రమం) పూర్తి చేసుకుని, సాయంత్రం 6 గంటలకు కారులో స్వగ్రామానికి బయలుదేరారు.
రాత్రి 10 గంటలైనా రాజు ఇంటికి చేరుకోకపోవడంతో, అతని సోదరులు యాదగిరి, భూపాల్ ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో వారు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అప్పనపల్లి శివారులో గాలించగా, రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు సగానికిపైగా మునిగి ఉండటాన్ని గుర్తించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో సుమారు 3 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా, అందులో నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం (మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి చేసే వైద్య పరీక్ష) కోసం దుబ్బాక వంద పడకల దవాఖానకు తరలించారు.
ఈ ప్రమాదంపై మృతుడి సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం సిద్దిపేట సీపీ రష్మీపెరుమాళ్, ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సీఐ రాజేశ్, ఎస్సై కీర్తిరాజ్ నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అతివేగం, అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం బల్వంతాపూర్‌లో ఆ నలుగురి అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.








