మద్దూరు మండల కేంద్రంలోని ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 250 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం మెనూ ప్రకారం భోజనం చేసిన తర్వాత, రాత్రి వేళ కొందరు విద్యార్థినులకు కళ్లు తిరగడం, వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి.

దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి, అస్వస్థతకు గురైన 13 మందిని అంబులెన్స్‌లో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న చేర్యాల సీఐ రమేశ్, మద్దూరు ఎంపీడీవో రామ్మోహన్ పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.