సీనియర్ ఐఏఎస్ అధికారి మందీప్ కే బండారిని CBSE చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిని అడిషనల్ సెక్రటరీ స్థాయికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నందున, ఆయన అదే స్థాయి జీతభత్యాలను అందుకోనున్నారు.
గతంలో 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. స్కాన్ చేసిన పేజీలు అస్పష్టంగా ఉండటం, కొన్ని పేజీలు కనిపించకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ వివాదాల నేపథ్యంలో బోర్డుపై విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కొత్త చైర్మన్ ముందున్న ప్రధాన సవాల్.
మందీప్ కే బండారి వృత్తిరీత్యా వైద్యులు. లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన ఆయన, గోల్డ్ మెడల్ సాధించి ప్రతిభ కనబరిచారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై 2001 బ్యాచ్ ఏజీఎమ్యూటీ (AGMUT) కేడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
పరిపాలనా విభాగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. జమ్ము కశ్మీర్‌లో డిప్యూటీ కమిషనర్, డివిజనల్ కమిషనర్, ఆరోగ్య మరియు వైద్య విద్యా శాఖ బాధ్యతలతో పాటు శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ సీఈఓగా కూడా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఆయన సేవలు అందించారు.
ప్రస్తుతం జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా, అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, త్వరలోనే CBSE చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త విద్యా సంవత్సరం, పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఆయన పర్యవేక్షించనున్నారు.








