స్కూల్ రోజుల్లోనే మోడలింగ్‌లో రాణించిన శ్రియా రెడ్డి, డిగ్రీ చదువుతున్న సమయంలో ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీడియో జాకీగా ఎంపికయ్యారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, తన యాంకరింగ్‌తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, తమిళం మరియు మలయాళ భాషల్లో వరుస అవకాశాలతో తన సత్తా చాటారు.

శ్రియా రెడ్డి నటనకు గాను కాంచీవరం, భరత్ చరణ్ ఐపీఎస్ చిత్రాలకు ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. తెలుగులో 'అప్పుడప్పుడు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైనా, విశాల్ నటించిన తమిళ చిత్రం 'థామరై' (తెలుగులో పందెంకోడి పేరుతో డబ్ అయింది) లోని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. గుర్రం గంగరాజు నిర్మించిన 'అమ్మ చెప్పింది' సినిమాలో కూడా ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.

ఆమె వ్యక్తిగత జీవితం కూడా సినిమాటిక్‌గా ఉంటుంది. 1973లో భారత క్రికెట్ జట్టులో ఆడిన భరత్ రెడ్డికి ఆమె కుమార్తె. అలాగే, ఆమె నిర్మాత విక్రమ్ కృష్ణను వివాహం చేసుకున్నారు. విక్రమ్ కృష్ణ స్టార్ హీరో విశాల్‌కు స్వయానా అన్నయ్య కావడంతో, శ్రియా రెడ్డికి సినీ పరిశ్రమతో బలమైన బంధం ఏర్పడింది. ఇలా తండ్రి క్రికెటర్ కాగా, భర్త నిర్మాత, మరిది స్టార్ హీరోగా ఉన్న అరుదైన కుటుంబ నేపథ్యంతో ఆమె సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.