బిగ్ బాస్ 10వ సీజన్ మొదటి వారంలోనే ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మొదటి వారంలో ఎలిమినేషన్లు ఉండవనే అంచనాలను తలకిందులు చేస్తూ, బిగ్ బాస్ వరుసగా ఇద్దరు కంటెస్టెంట్లను ఇంటి నుంచి పంపేశారు.

సెప్టెంబర్ 11 నాటి ఎపిసోడ్‌లో చైత్రా రాయ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో చరణ్ నిష్క్రమించగా, తాజాగా చైత్ర ఎలిమినేషన్ హౌస్‌లో వాతావరణాన్ని వేడెక్కించింది. ఎపిసోడ్ మొదట్లో రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి సేఫ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

ఇకపై ఇంట్లో ఎలాంటి టీమ్‌లు ఉండవని, ప్రతి ఒక్కరూ సొంతంగానే ఆడాలని బిగ్ బాస్ స్పష్టం చేశారు. హౌస్‌మేట్స్‌కు సులభమైన దారి, కష్టమైన దారి అని రెండు మార్గాలను ఇచ్చారు. సుధీర్, వర్షిణి కష్టమైన దారిని ఎంచుకోగా, మిగిలిన వారు సులభమైన దారిని ఎంచుకున్నారు. అయితే, ఇప్పటికే హై రిస్క్‌లో ఉన్న చైత్రా రాయ్‌కి ఈ టాస్క్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు.

ఇంట్లో త్రిగుణ్ తనదైన శైలిలో మైండ్ గేమ్స్ ఆడుతూ అందరికీ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అమన్ మసూద్‌ను కలిసి రోహిత్ గురించి నెగెటివ్‌గా మాట్లాడటం, గిన్నెలు కడిగే విషయంలో రోహిత్‌తో గొడవ పడటం వంటివి చర్చనీయాంశమయ్యాయి. త్రిగుణ్ బయటకు న్యాయంగా కనిపిస్తూనే, సమయానికి తగ్గట్టు మాట మారుస్తున్నాడని ముఖేష్ గౌడ అసహనం వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ నిర్వహించిన ‘రన్ రాజా రన్’ టాస్క్‌కు త్రిగుణ్‌ను సంచాలక్‌గా నియమించారు. అక్కడ కూడా అతను తన నిర్ణయాలతో రచ్చ చేయగా, చివరికి రామ్ ప్రసాద్ విజేతగా నిలిచారు. చివరగా చైత్రకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.