యంగ్ హీరో జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ నటిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామాపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
తన అన్నయ్య కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతుండటం సంతోషంగా ఉందని మహేష్ బాబు పేర్కొన్నారు. తన మొదటి సినిమా 'రాజకుమారుడు' విడుదలైన తేదీనే ఈ చిత్రం కూడా విడుదల కావడం వెనుక అశ్వినీ దత్ గారి ఆలోచన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో దత్ గారు చాలా పక్కాగా ఉంటారని మహేష్ గుర్తుచేశారు.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై లాంచ్ అవ్వడం జయకృష్ణ, రాషాలకు దక్కిన అదృష్టమని మహేష్ బాబు అన్నారు. తాను, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి నటులు కూడా ఇదే బ్యానర్‌లో పరిచయం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చివరగా చిత్ర బృందం మొత్తానికి మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.
జూలై 30న ఈ సినిమా విడుదల కానుండటంతో ఘట్టమనేని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.







