అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్’కు సీక్వెల్ రాబోతోంది. 2017లో విడుదలైన ఈ థ్రిల్లర్ సినిమాకు గాను, శ్రీదేవి మరణానంతరం ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం దక్కింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘మామ్ 2’లో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తోంది.
‘ది ఆర్చీస్’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఖుషీ కపూర్, ఆ తర్వాత ‘నాదానియాన్’, ‘లవ్యాపా’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. దీంతో ఈ కొత్త చిత్రంతో తన కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాలని ఆమె భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తుండగా, గిరీశ్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నోయిడా మరియు గ్రీస్ ప్రాంతాల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఖుషీ కపూర్‌తో పాటు జిషు సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ ఏడాది నవంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.







