మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వ యోభారంతో పాటు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆ మె మృతితో తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జానకి.. విజయా వారి ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం షావుకారు (1950) ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. షావుకారు సినిమా హిట్ కావడంతో ఆమెకు షావుకారు జానకిగా పేరు వచ్చింది. దాదాపు 70 ఏళ్ల సుదీర్ఘ నటప్రస్థానంలో తెలుగు,
తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. 3 హిందీ చిత్రాల్లో, ఒక మలయాళ సినిమాలో నటించి మెప్పించారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్‌లతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు షావుకారు జానకి. కన్యా శుల్కం, పిచ్చి పుల్లయ్య, వద్దంటే డబ్బు, రోజులు మారాయి, రేచుక్క పగటిచుక్క, సొంత ఊరు, డాక్టర్ చక్రవర్తి, సంసారం ఒక చదరంగం, జయం మనదే, తోడికోడళ్లు, బాబు బంగారం, గీతాంజలి తదితర అనేక హిట్ చిత్రాల్లో షావుకారు జానకి నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె చివరిసారి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో నటించారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్‌ను ప్రారంభించిన షావుకారు జానకి దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని సిఎం పేర్కొన్నారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని సిఎం గుర్తుచేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారని సిఎం అన్నారు. పలు మేటి చిత్రాల్లో షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదని ఆయన అన్నారు. భగవంతుడు ఆమెకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, అమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాటల్లో మాధుర్యం, నటనలో సహజత్వం, హావభావాల్లో వైవిధ్యం.. కలగలిసిన నటి ‘షావుకారు’ జానకి. కథానాయికగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయక ఛాయలున్న పాత్రలతోనూ మెప్పించి నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె. ఏడు దశాబ్దాల ప్రయాణంలో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆమె సుధీర్ఘ సినీ ప్రయాణం చిరస్మరణీయం.
1931 డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించిన జానకి, అసలు పేరు శంకరమంచి జానకి. సాధారణ పరిస్థితుల నుంచి సినిమా రంగంలోకి వచ్చిన మహిళ. ఆమె చిన్న వయసులోనే రేడియో, నాటక రంగాలతో కళల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆకాశవాణి మద్రాస్‌లో రేడియో ఆర్టిస్టుగా పనిచేయడంతో పాటు 300కిపైగా నాటకాల్లో నటించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా ఆమెను నటనా రంగం వైపు నడిపించాయి. ఆ నిర్ణయం తర్వాత దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయంగా మారారు.
1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘షావుకారు’ జానకి తొలిచిత్రం. ఇందులో ఆమె ఎన్టీ రామారావుకు జంటగా నటించారు. ఈ చిత్రంలో ఆమె పోషించిన ‘సుబ్బులు’ అనే అమాయకపు, పక్కింటి యువతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. . అప్పటినుంచి ఆమె ‘షావుకారు జానకి’గా గుర్తింపును అందుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు తమిళంలోనూ, మూడో ఏడాదికి కన్నడలోనూ ఎంట్రీ ఇచ్చారు. 1954లో వచ్చిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంతో ఆమె నటిగా మరింత గుర్తింపును అందుకున్నారు. ఆ తర్వాతి రెండేళ్లలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏడాదికి పన్నెండు సినిమాలతో ఆమె ఫుల్ బిజీ అయ్యారు. కన్యాశుల్కం (1955)లో ఆమె పోషించిన బుచ్చమ్మ పాత్ర అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో ఆమె నటన ఎంతో సహజంగా, నాటి సాంఘిక వ్యవస్థను ప్రతిబింబించేలా ఉందని ప్రశంసలు అందుకుంది. అలాగే ‘రోజులు మారాయి’ (1955)లో అల్లరి పిల్లగా, అమాయకపు యువతిగా వైవిధ్యభరిత నటనతో ఆకట్టుకున్నారు.
‘మంచి మనసులు’ (1962)లో ఎంతో హుందాగా, భావోద్వేగభరిత పాత్రతో మెప్పించారు. ‘డాక్టర్ చక్రవర్తి’ (1964)లో పోషించిన నిర్మల పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఇందులో ఆమె వాచ్ చూస్తూ అసహనంగా ముఖం పెట్టే హావభావాలు చాలా ఫేమస్ అయ్యాయి. అలాగే శివాజీ గణేశన్ ‘ఫుతియ పరవై’ (1964)లో క్లబ్ డాన్సర్‌గా గ్లామరస్‌గా కనిపిస్తూనే, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో తన నటనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరు కోడుగల్’ (1969) చిత్రం ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇందులో నటనకు తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇలా తెలుగుతోపాటు ఇతర భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారామె. తనను తాను ఒకే రకమైన పాత్రకు పరిమితం చేసుకోకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.
తెలుగులో వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, రేచుక్క పగటిచుక్క, కన్యాదానం, జయం మనదే, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించారు. ఒకే తరానికి చెందిన నటిగా ఆమె మిగలలేదు. ఒక దశలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర కథానాయకులతో హీరోయిన్‌గా కనిపించిన ఆమె, తర్వాతి తరాల హీర








