బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు లంచం డబ్బును పంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. లంచం వస్తే దానిని 60 మంది కౌన్సిలర్లు సమానంగా పంచుకుంటామని, ఒకరికొకరు అండగా ఉంటామని వారు గంగాజలం చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు.

పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం తరహాలో ఈ లంచం ప్రతిజ్ఞ జరిగింది. ఒక వ్యక్తి గంగాజలం పాత్రను పట్టుకోగా, మిగిలిన వారు ఆ నీటిని చేతిలో ఉంచుకుని అతను చెప్పిన మాటలను వల్లెవేశారు. ఏ సభ్యునికైనా సమస్య వస్తే మిగిలిన వారు మద్దతు ఇస్తామని, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారిని ద్రోహిగా పరిగణిస్తామని వారు అందులో పేర్కొన్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో ప్రజలు కౌన్సిలర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని పంచుకోవడానికి ప్రజా ప్రతినిధులు ఇంతలా బరితెగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కౌన్సిలర్లు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ సౌమ్యా గురురాణి స్పందించారు. ఇది గత ఏడాది నవంబర్ నాటి వీడియో అని, తాను అప్పుడు పదవిలో లేనని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని, విచారణ పూర్తయ్యాక దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.