పోకో ఇండియా తన కొత్త X8 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్లు పోకో వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయానికి రానున్నాయి.

కొత్త ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యానికి కంపెనీ పెద్దపీట వేసింది. పోకో X8 5జీ మోడల్‌లో 9,000mAh బ్యాటరీ ఉండగా, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3.2 రోజుల వరకు వస్తుంది. దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

పోకో X8 పవర్ 5జీ మోడల్‌లో ఏకంగా 10,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 3.5 రోజుల వరకు ప్లేబ్యాక్ టైమ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 100W వైర్డ్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. రెండు ఫోన్లలోనూ బైపాస్ ఛార్జింగ్, PPS, స్మార్ట్ ఛార్జింగ్ వంటి సాంకేతికతలు ఉంటాయి.

లీక్ అయిన సమాచారం ప్రకారం, పోకో X8 పవర్ 5జీలో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌తో పాటు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఉన్న 50MP మెయిన్ కెమెరా ఇందులో ఉండొచ్చని అంచనా.

పోకో X8 5జీ మోడల్ స్నాప్ డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్, 6.83-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో రావచ్చు. ఈ ఫోన్ ఆరెంజ్, వైట్ రంగుల్లో లభిస్తుంది. పోకో X8 పవర్ 5జీ మాత్రం ఎల్లో రంగులో స్పెషల్ స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్‌తో రానుంది.

ఈ రెండు ఫోన్లకు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ లభించే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందించే అవకాశం ఉందని సమాచారం.