ప్రస్తుతం సినిమా రంగంలో హీరోల మధ్యే కాకుండా దర్శకుల మధ్య కూడా నెంబర్ గేమ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో సౌత్ దర్శకుల డామినేషన్‌ను అడ్డుకోవాలని బాలీవుడ్ మేకర్లు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, దేశంలోనే అతిపెద్ద దర్శకుడిగా నిలిచారు. ఆయన సెట్ చేసిన ప్రమాణాలను అందుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు ఇతర దర్శకులు పోటీ పడుతున్నారు.
సౌత్ దర్శకుల విషయానికి వస్తే, సుకుమార్ తన 'పుష్ప 2' సినిమాతో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేసి కొత్త దారి చూపించారు. తక్కువ సినిమాలే చేసినా సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' సినిమాలతో వేల కోట్ల వసూళ్లు సాధించిన ప్రశాంత్ నీల్, నేషనల్ మార్కెట్‌లో సౌత్ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించారు.
మరోవైపు బాలీవుడ్ నుంచి సిద్ధార్థ్ ఆనంద్, అయాన్ ముఖర్జీ వంటి దర్శకులు సౌత్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే, ఇటీవల 'ధురంధర్' సిరీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆదిత్యధర్ రేసులోకి వచ్చారు. బాహుబలి నెంబర్లకు దగ్గరగా వచ్చిన ఆయన, బాలీవుడ్‌లోనూ సౌత్‌తో పోటీ పడే సత్తా ఉన్న దర్శకులు ఉన్నారనే సంకేతాలను ఇచ్చారు.
ఆదిత్యధర్ సాధించిన ఈ విజయం బాలీవుడ్ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. అయితే, సౌత్ దర్శకులతో సమానంగా పోటీ పడగలమనే పూర్తి నమ్మకం కలగాలంటే, ఆదిత్యధర్ కాంపౌండ్ నుంచి మరో హిట్ రావాల్సి ఉంది. అప్పుడే బాలీవుడ్ మేకర్లకు సౌత్ సినిమాలతో పోటీ పడే సత్తా వచ్చిందా లేదా అన్న విషయంలో స్పష్టత వస్తుంది.








