పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం సాయంత్రం 6:40 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను, హైకోర్టు ఆదేశాలతో పోలీసులు గతంలో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను గురుగ్రామ్‌లోని మోదాంత ఆస్పత్రి వైద్య బృందానికి అప్పగించారు.

సోనమ్ వాంగ్‌చుక్ భార్య అన్మోగ్ గీతాంజలి తన భర్తను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పౌరులకు తమకు నచ్చిన చోట చికిత్స పొందే హక్కు ఉందని పేర్కొన్న ధర్మాసనం, ఆయనను తరలించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, డిశ్చార్జ్ సమయానికి సోనమ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఆయన పాంక్టోపేనియా సమస్యతో బాధపడుతున్నారని, సీరమ్ పొటాషియం నిల్వలు 3.4 mEq/L ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఆయనకు అందించిన చికిత్సకు సంబంధించిన అన్ని నివేదికలను, డాక్యుమెంట్లను మోదాంత ఆస్పత్రి వైద్య బృందానికి అందజేశామని వారు తెలిపారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలో జవాబుదారీతనం కోరుతూ జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చికిత్స కోసం ఆయన మోదాంత ఆస్పత్రిలో చేరారు.