హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) — అంటే నగరానికి తాగునీరు, మురుగునీటి వ్యవస్థలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ, మంజీరా నది నుంచి సైబరాబాద్‌కు అందుతున్న రోజువారీ నీటి సరఫరాను తగ్గించాలని ప్రతిపాదిస్తోంది. జనవరి 2027 నుంచి ఈ మార్పులు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే సుమారు 3.5 లక్షల నీటి కనెక్షన్లపై నేరుగా ప్రభావం పడుతుంది.

ప్రస్తుతం మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మదీనాగూడ, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట్ ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గితే ఇబ్బందులు తప్పవు. ఈ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లో నీటి కొరత ఏర్పడవచ్చు. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో కొరత ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు.

నగర తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో మరమ్మతులు జరుగుతుండటంతో, అక్కడి నుంచి నీటిని తీసుకునే అవకాశం లేదు. సింగూరులో ప్రస్తుతం 2.55 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా, అందులో వాడుకోవడానికి వీలున్నది కేవలం 1.8 టీఎంసీలు మాత్రమే.

దీంతో హైదరాబాద్ తాగునీటి భారం మొత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైనే పడనుంది. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో వారానికోసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండాకాలం నాటికి పరిస్థితి మరింత గడ్డుగా మారుతుందన్న భయం నగరవాసుల్లో నెలకొంది.

భూగర్భ జలాలు, చెరువులు, చిన్న రిజర్వాయర్లు అన్నీ ఇంకిపోవడంతో చలికాలంలోనే తాగునీటి ముప్పు పొంచి ఉంది. ఎండాకాలం మొత్తం నగరానికి 21 టీఎంసీల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ అవసరాల కోసం రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, అందులో 1200 క్యూసెక్కులు హైదరాబాద్‌కే కేటాయిస్తున్నారు.