సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) తన అధికారిక లోగో రూపకల్పన కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) సహకారంతో ప్రత్యేక పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు మరియు సృజనాత్మక రంగ నిపుణులు పాల్గొనవచ్చు.
పోటీలో విజేతగా నిలిచిన వారికి రూ. 20 వేలు, ద్వితీయ స్థానంలో ఉన్న వారికి రూ. 15 వేలు, తృతీయ స్థానంలో ఉన్న వారికి రూ. 10 వేల నగదు బహుమతిని అందజేస్తారు. ఆసక్తి ఉన్నవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఎంట్రీలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఎంట్రీని మాత్రమే పంపడానికి అవకాశం ఉంది.
డిజైన్లను సమర్పించేటప్పుడు అభ్యర్థులు అధిక నాణ్యత గల PNG లేదా JPEG ఫైల్‌తో పాటు, ఆ లోగో వెనుక ఉన్న భావనను గరిష్ఠంగా 250 పదాల్లో వివరించాలి. AI, EPS లేదా SVG వెక్టార్ ఫార్మాట్‌లో రూపొందించిన డిజైన్లకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, కాపీరైట్ ఉల్లంఘనలు లేదా AI ద్వారా నకలు చేసిన డిజైన్లను తిరస్కరిస్తారు. డిజైన్ పూర్తిగా ఒరిజినల్‌గా ఉండటంతో పాటు ప్రింట్ మరియు డిజిటల్ వినియోగానికి అనువుగా ఉండాలి.
ఎంట్రీలను సమర్పించడానికి ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 10న విజేతలను ప్రకటించనున్నారు. ఎంపికైన లోగోను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆవిష్కరిస్తారు. సుపరిపాలన, సుస్థిరత మరియు అభివృద్ధి చెందుతున్న నగర దృక్పథాన్ని ప్రతిబింబించేలా లోగో ఉండాలని కమిషనర్ సృజన సూచించారు.








