నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) పథకం ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, బీజేపీ ఎంపీ లుంబా రామ్ ఆర్థిక సహాయం పొందినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ ఎంపీ అయిన భగీరథ్ చౌదరి 2026లో, సిరోహి ఎంపీ లుంబా రామ్ 2025లో ఈ పథకం కింద సబ్సిడీని అందుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, తాను పొందిన సబ్సిడీని తిరిగి చెల్లించినట్లు భగీరథ్ చౌదరి వెల్లడించినట్లు మంత్రి తన లేఖలో వివరించారు.
ఈ సబ్సిడీని సంబంధిత బ్యాంకుకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకున్నామని, ఎన్‌హెచ్‌బీలో జమ చేసేందుకు బ్యాంకుకు తగిన ఆదేశాలు జారీ చేశామని మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లేదా వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రయోజనం పొందడం లేదా వైదొలగడంపై ఎన్‌హెచ్‌బీ మార్గదర్శకాలలో ప్రత్యేక నిబంధనలు లేవని ఆయన స్పష్టం చేశారు.
అయితే, దరఖాస్తుల ప్రక్రియ అంతా పారదర్శకమైన బహుళ స్థాయి యంత్రాంగం ద్వారానే జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.








