జాతీయ గేయం వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు’ను తీసుకువస్తోంది. ప్రస్తుతం జాతీయ గీతం, జాతీయ జెండా, రాజ్యాంగాలకు ఉన్న రక్షణతో సమానంగా వందేమాతరానికి కూడా ఈ బిల్లు ద్వారా రక్షణ లభిస్తుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1875లో రచించిన వందేమాతరం, 1882లో ఆయన రాసిన ‘ఆనందమఠ్’ నవలలో ప్రచురితమైంది. ఈ గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఏడాది పొడుగునా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే వందేమాతరాన్ని పాడాలని, అది కూడా మొత్తం ఆరు చరణాలను సుమారు 3 నిమిషాల 10 సెకన్ల పాటు ఆలపించాలని హోంశాఖ తాజాగా స్పష్టం చేసింది. 1937లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని నిర్ణయించడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఈ చారిత్రక నిర్ణయం వెనుక ముస్లిం లీగ్ ఒత్తిడి ఉందని, కాంగ్రెస్‌కు వందేమాతరం అంటే ద్వేషమని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు.
ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే, వందేమాతరాన్ని ఆలపించకుండా అడ్డుకున్నా లేదా అవమానించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.








